#indianconstitution #భారతరాజ్యాంగం #constitutionofindia #jaganinfo
భారత రాజ్యాంగం - భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు :
భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12 వ షెడ్యూళ్ళను చేర్చబడింది.
1 వ షెడ్యూల్ :భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
2 వ షెడ్యూల్ : జీత భత్యాలు
3 వ షెడ్యూల్ : ప్రమాణ స్వీకారాలు
4 వ షెడ్యూల్ : రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల స్థానాల విభజన
5 వ షెడ్యూల్ : షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన
6 వ షెడ్యూల్ : ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన
7 వ షెడ్యూల్ : కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
8 వ షెడ్యూల్ : రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు
9 వ షెడ్యూల్ : న్యాయస్థానాల పరిధిలోకి రాని కేంద్ర మరియు రాష్ట్రా ప్రభుత్వాలు జారీ చేసిన చట్టాలు
10 వ షెడ్యూల్ : పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
11 వ షెడ్యూల్ : గ్రామ పంచాయతీల అధికారాలు
12 వ షెడ్యూల్ : నగర పంచాయతి, పురపాలక సంఘాల అధికారాలు
సవరణలు
రాజ్యాంగంలో మార్పులకు, తొలగింపులకు సంబంధించి పార్లమెంటుకు రాజ్యాంగం అపరిమితమైన అధికారాలిచ్చింది. రాజ్యాంగం నిర్దేశించినదాని ప్రకారం సవరణలను కింది విధంగా చెయ్యాలి:
పార్లమెంటు ఉభయసభల్లోను సవరణ బిల్లు ఆమోదం పొందాలి.
సభలో హాజరైన సభ్యుల్లో మూడింట రెండు వంతుల ఆధిక్యత, మొత్తం సభ్యుల్లో సాధారణ ఆధిక్యతతో మాత్రమే బిల్లు ఆమోదం పొందుతుంది.
అయితే ప్రత్యేకించిన కొన్ని అధికరణాలు, షెడ్యూళ్ళకు సంబంధించిన సవరణల బిల్లులు పార్లమెంటు ఉభయసభలతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో కనీసం సగం సభలు కూడా ఆమోదించాలి.
పై విధానాల ద్వారా ఆమోదం పొందిన బిల్లులు రాష్ట్రపతి సంతకం అయిన తరువాత, సంతకం అయిన తేదీ నుండి సవరణ అమలు లోకి వస్తుంది.
2012 ఏప్రిల్ వరకు రాజ్యాంగానికి 100 సవరణలు జరిగాయి. అవతారికలోను, సవరణ విధానంలోను కూడా సవరణలు జరిగాయి.
ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు
భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి
ఏక పౌరసత్వం--బ్రిటన్
పార్లమెంటరీ విధానం--బ్రిటన్
సభాపతి పదవి--బ్రిటన్
భారతదేశంలో ప్రాథమిక హక్కులు--అమెరికా
అత్యున్నత న్యాయస్థానం--అమెరికా
న్యాయ సమీక్షాధికారం--అమెరికా
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు--ఐర్లాండ్
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి--ఐర్లాండ్
రాజ్యసభ సభ్యుల నియామకం--ఐర్లాండ్
భారతదేశంలో ప్రాథమిక విధులు--రష్యా
కేంద్ర రాష్ట్ర సంబంధాలు--కెనడా
అత్యవసర పరిస్థితి--వైమర్ (జర్మనీ)
రాజ్యాంగ విశేషాలు :
భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. పౌరులకు, భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి కింది వాటిని సూత్రీకరించింది:
ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ
బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థ
ప్రాథమిక విధులు
భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు
ఆదేశ సూత్రాలు
ద్విసభా విధానం
భాషలు
వెనుకబడిన సామాజిక వర్గాలు
అవసరమైనపుడు రాజ్యాంగాన్ని సవరించుకోడానికి వెసులుబాటు కలిగిస్తూ, సవరణ విధానాన్ని కూడా నిర్దేశించింది.