ఈరోజు మనం కర్మసిద్దాంతం అంటే ఏమిటో సంక్షిప్తంగా, తేలికైన మాటలలో చెప్పుకుందాం. సాధారణంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా అనుకోని ఇబ్బంది కలిగినప్పుడు, లేదా కష్టం వచ్చినప్పుడు అంతా నా కర్మ అని తలకొట్టుకోవడం చూస్తూనే ఉంటాం. అసలు ఏమీటీ కర్మ? ఈ కర్మల గురించి చెప్పే కర్మసిద్ధాంతం అసలు స్వరూపం ఏమిటి? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. అయితే కర్మసిద్ధాంతం వేరు, కర్మయోగం వేరు. మనం చేసిన కర్మల తాలుకూ ఫలితం ఏవిధంగా నిక్షిప్తమై ఉంటుందో, ఆ కర్మఫలితాన్ని ఎలా అనుభవిస్తామో చెప్పేది కర్మసిద్ధాంతం. అసలు మానవుడు కర్మలు ఎందుకు చెయ్యాలో, ఏ విధంగా కర్మలు చేస్తే మనకు పాపపుణ్యాలు అంటవో చెప్పేది కర్మయోగం.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగో2స్త్వకర్మణి
అర్జునా! నీ కర్తవ్యాన్ని అనుసరించి కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది తప్ప, వాటి ఫలితాలపై మాత్రం నీకు ఎటువంటి అధికారం లేదు. అలా అని కర్మలు చెయ్యడం ఎప్పుడూ మానకూడదు. ఇదీ తనవారిపై యుద్ధం చేయనని కూర్చున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసినటువంటి బోధ. చేయాల్సిన కర్మపై కాకుండా కర్మఫలితంపై మాత్రమే దృష్టి పెడితే చిత్తశుద్ధితో ఆ కర్మను చేయలేం. అందుకే కర్మ ఫలితం గురించి ఆలోచించకుండా, “నా కర్తవ్యం కనుక ఈ పని చేస్తున్నాను” అని ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తే ఆ కర్మలకు తగ్గ ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది. ఫైగా ఆ కర్మల పాపపుణ్యాలు కూడా చేసినవానికి అంటుకోవు. ఇది కర్మయోగానికి మూలసూత్రం వంటిది. ఈ కర్మయోగం గురించి మరింత విపులంగా రానున్న రోజుల్లో మనం చెప్పుకోబోయే “భగవద్గీత ఏ అధ్యాయంలో ఏముంది” అనే శీర్షికలో మాట్లాడుకుందాం. ఈరోజు మాత్రం కర్మసిద్ధాంతం అంటే ఏమిటో సంగ్రహంగా చెప్పుకుందాం.