కోటప్పకొండ, పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి[1] చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అది నేత ఇంద్ర దేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.
కొండను ఏ కోణం నుండి చూసినా (త్రికూటాలు) మూడు శిఖరాలు కనపడతాయి. కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడి స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ మూడు శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ మూడు రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం సా.శ. 1172 లో నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.[1] ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు, ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేసారు. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్లమార్గాన్ని సా.శ.1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయణి నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేసారు. త్రికోటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సంప్రదాయం లేదు.[2]
స్థలపురాణం