భగవాన్ శ్రీ రమణ మహర్షి సన్నిధిలో దాదాపు పది సంవత్సరాలు గడిపి శ్రీవారి కరుణకు పాత్రులైన భక్తులలో సూరి నాగమ్మ గారు ఒకరు. ఆమె 1945 నుండి 1950 వరకు (అంటే శ్రీ భగవాన్ మహాసమాధి వరకు) శ్రీ రమణాశ్రమంలో జరిగిన విశేషాలను తమ అన్నగారికి లేఖలుగా రాశారు. ఈ లేఖలలో శ్రీవారి అమృత వాక్కులు, సకల జీవరాసుల పట్ల వారి కరుణా తెలుస్తాయి. సందర్భానుసారంగా శ్రీ భగవాన్ తమ చిన్ననాటి ముచ్చటలూ, అరుణాచలం పై నివసించిన కాలంలో జరిగిన విశేషాలు సెలవిచ్చేవారు. అట్లాగే అనేక పురాణ గాథలను కూడా వాటినన్నిటిని నాగమ్మ గారు ఎప్పటికప్పుడు తమ అన్న గారికి రాసేవారు. ఆ లేఖలని శ్రీ భగవాన్ కి వినిపించేవారు. "నాగమ్మ విజయ దానం చేస్తుంది" అని శ్రీ భగవాన్ ఒకసారి అన్నారు.
ఈలేఖల విశిష్టత కేవలం విషయంలోనే కాదు, ఆ విషయాన్ని చెప్పిన భాషాశైలిలో కూడా ఉంది. సరళమై, మనోహరమై, గంభీరమై ఒక చక్కని కావ్యాన్ని చదువుతున్న అనుభూతి కలిగిస్తుంది.