తంత్రాలలోకెల్లా గొప్ప తంత్రం విజ్ఞాన భైరవ తంత్రం - ఇందులో మొత్తం 112 తంత్రాలున్నాయి. అంటే 112 టెక్నిక్స్ ఉన్నాయి. సాక్షాత్తూ యోగీశ్వరేశ్వరుడైన పరమ శివుడు జగన్మాత పార్వతీదేవికి చెప్పిన తంత్రాలివి. వీటిలో మనకు సరిపోయే టెక్నిక్ ఏదో తెలుసుకొని, దానిని సాధన చేయడం ద్వారా చైతన్య స్థితికి ఆవల ఉన్న స్థితిని చేరుకోవచ్చు. ఆ స్థితికే భైరవస్థితి అని పేరు. అటువంటి విజ్ఞానాన్ని అందించే తంత్రమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. ఈ తంత్రసాధనకు మన తెలివితేటలు కానీ, మనం చదివిన ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ, ఇదివరకే నేర్చుకున్న యోగ సాధనలు కానీ ఏమాత్రం ఉపయోగపడవు. యోగ, తంత్ర పూర్తిగా వేరు వేరు ప్రక్రియలు. యోగసాధనకు మానసిక, శుధ్ధతతో పాటు, శారీరక నియమాలు కూడా కచ్చితంగా పాటించాలి. గురువు మార్గదర్శనం లేకుండా కొన్ని రకాల యోగసాధనలు చేయడం చాలా ప్రమాదం కూడా. కానీ తంత్రసాధన అందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. మనం క్షుద్రమైన వామాచార తంత్రాల జోలికి పోవడం లేదు కనుక, వాటికి సంబంధించిన విధివిధానాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం లేదు. మిగిలినటువంటి తంత్రాలతో పోల్చి చూసినా విజ్ఞాన భైరవ తంత్రం వాటికి పూర్తిగా భిన్నమైంది.
ఈ విజ్ఞాన భైరవ తంత్రసాధనకు కావలసినదల్లా ఆ పరమశివుణ్ణే గురువుగా భావించి పరిపూర్ణ విశ్వాసంతో ఆ సూత్రాలను సాధన చెయ్యడం. ఈ తంత్ర సాధనతో అసలేంటి లాభం అని అడిగితే కనుక... ఈ 112 టెక్నిక్స్‌లో మీదైన టెక్నిక్ ఏదో తెలిసిన నాడు ఆ లాభం ఏమిటో మీరే గ్రహించగలుగుతారు. నేను కూడా మీలాగే ఒక సాధకుణ్ణి మాత్రమే. విజ్ఞాన భైరవ తంత్రాకు సంబంధించిన అనేక వ్యాఖ్యానాలు చదివి ఉండటం వల్ల, అందులో ఉన్న విషయాలను నిర్దుష్టంగా చెప్పగలగడం తప్ప నాకు మరే అదనపు అర్హతా లేదు. కేవలం ఆ పరమశివుడే మనకు గురువు. ఆ స్వామి అనుగ్రహంతోటే మనం ఈ సాధనలు మొదలు పెడుతున్నాం. ఒక్కో టెక్నిక్‌ని కొన్ని రోజుల పాటూ సాధన చేయాలి. ఆ తరువాతనే మరో టెక్నిక్ దగ్గరకు వెళ్లాలి. ఇక మొదటి టెక్నిక్ చెప్పుకుందాం.
Rajan PTSK