బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి "వినదగునెవ్వరు చెప్పిన" పుస్తక ఆవిష్కరణ
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు, "ప్రవచన సార్వభౌమ" బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు గారు విద్యార్థులకు శీల నిర్మాణము కొరకు, వారిలో నైతిక విలువలను పెంపొందించుకొనుట కొరకు ఎందరో మహానుభావులు చెప్పిన మంచి మాటలన్నిటినీ క్రోడీకరించి 116 సంచికలుగా "వినదగునెవ్వరు చెప్పిన" అనే శీర్షికతో ప్రవచనములు చేసియున్నారు. ఇందులో కంచి కామకోటి 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి నుండి మహాత్మా గాంధీ గారు, వివేకానంద స్వామి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, జాషువా గారు, అబ్రహాం లింకన్, ఫోర్డ్ వంటి అనేకమంది మహానుభావులు చెప్పిన మంచి మాటలకు వారు వ్యాఖ్యానము చేశారు. విద్యార్థులకు ఎంతగానో ఉపయుక్తమైన ఈ ప్రవచనములను ఎమెస్కో పుస్తక సంస్థ వారు పుస్తకముగా ప్రచురించారు. ఈ పుస్తకమును నిన్న (02-03-2025) సంపూర్ణ శ్రీరామాయణము జరుగుతున్న వేదికపై ఆవిష్కరించారు.
ముందుగా పుస్తకములను గాయత్రీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినులు పుష్పములతో స్వాగతించగా, మేళతాళాలతో పుస్తకములను చత్రము పట్టి తీసుకువచ్చి వేదికపై ఉంచారు. గాయత్రీ విద్యాసంస్థల సంచాలకులు, విద్యా దానమునందు గొప్ప పూనిక, శ్రధ్ధ కలిగిన ఆచార్య శ్రీ సోమరాజు గారు ఈ పుస్తకమును ఆవిష్కరించారు. మొదటి ప్రతిని శ్రీ సీతారాముల పాదముల వద్ద సమర్పించారు. సభలో శ్రీ అన్నంరాజు సత్యనారాయణమూర్తి గారు, ఎమెస్కో పుస్తక సంస్థల అధినేత ఎమెస్కో విజయ్ కుమార్ గారు వంటి పెద్దలు పాల్గొని, పుస్తక ప్రతులను అందుకున్నారు.
విద్యార్థులందరూ ముందు పెద్దలు చెప్పిన మంచి మాటలను వినటం నేర్చుకోవాలని, అటువంటి మాటలే శీల నిర్మాణము కొరకు, నైతిక విలువలను పెంపొందించుకొనుట కొరకు ఎంతగానో ఉపయోగపడతాయని, అందుకోసమే తాను ఈ ప్రయత్నం చేశానని శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు వివరించారు. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలను కూలంకషంగా పరిశీలించి, వారు చెప్పిన మంచి మాటల సారాంశమును తెలుసుకొని, వాటిని విద్యార్థులకు మరియు అందరికీ పనికొచ్చే విధముగా ఆవిష్కరించుట కొరకు ఎంతో శ్రమించానని, అది తనకు గొప్ప మధురానుభూతి అని, వారు చేసిన ఈ ప్రవచనములు పుస్తక రూపమును పొందటం చాలా సంతోషదాయకమని శ్రీ గురువుగారు తమ హర్షమును వ్యక్తం చేశారు.
#SriChagantiVaani
#chagantikoteswararaogaru
#Personalitydevelopment
#SriChagantiVaani
#chagantikoteswararaogaru
#chagantipravachanam
#Chaganti
#Ethics
#VinadagunevvaruCheppina