*యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..*
వరంగల్ లో ఉత్సాహభరితంగా 2కే రన్..
డ్రగ్స్ నిర్మూలనపై టీఎస్ జెయు పోరాటం అభినందనీయం..
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా..
వరంగల్, ఫిబ్రవరి 12 :
యువత సరదాగా డ్రగ్స్ అలవాటు చేసుకొని బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టిఎస్ జెయు) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ పోచం మైదాన్ చౌరస్తా నుంచి కాకతీయ మెడికల్ కళాశాల వరకు 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబర్ కిషోర్ జా, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, టీఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, ఎన్ యు జె (ఐ) జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్ లతో కలిసి జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారికి బానిసలై యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. సరదాగా కిక్ కోసమో, థ్రిల్ కోసమో మొదలయ్యే మత్తు మందుల అలవాట్లు యువత పాలిట శాపాలుగా మారుతున్నాయన్నారు. డ్రగ్స్ విషవలయంలో చిక్కుకుంటున్న యువత భవిష్యత్ సర్వనాశనం అవుతోందన్నారు. డ్రగ్స్ వ్యసనాలను వదులుకోలేని కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని బయట పడేసేందుకు సామాజిక సంస్థలు తమవంతుగా కృషి చేయాలని సూచించారు. ఇందులో భాగంగా టీఎస్ జెయు చేస్తున్న కృషిని కొనియాడారు.
వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ అశ్విని తానాజీ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి యువత భవితవ్యాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందన్నారు. దేశ అభివృద్ధికి తోడ్పడాల్సిన విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటుపడి వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జన్మలకంటే మానవజన్మ ఎత్తడం అదృష్టమన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానాలకు రావాలని కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి అనునిత్యం కృషి చేయాలన్నారు. కానీ కొందరు డ్రగ్స్ మహమ్మారి ఊబిలో చిక్కుకోవడం తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు.
టీఎస్ జెయు రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి మన రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని అన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడి ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయన్నారు . మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల మన మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు లోనవుతామని తెలిపారు. డ్రగ్స్ వల్ల జీవితాలు రోడ్డున పడతాయని అన్నారు.
డ్రగ్స్ అలవాటు పడిన వారు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల జీవితాలు సైతం రోడ్డు పడతాయన్న విషయం గురించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదిగి మంచి కుటుంబంతో సంతోషంగా బతకాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో కోటి మందిని చైతన్యవంతం చేయాలని లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా వరంగల్ ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. దశలవారీగా అన్ని జిల్లాలలో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. టీఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులుగా కేవలం వార్తలు రాసేందుకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి మద్దతుగా డ్రగ్స్ వినియోగంపై టిఎస్ జెయు ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తెస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన ప్రభుత్వ సంస్థల అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కందికొండ మోహన్, ప్రధాన కార్యదర్శి ఆవునూరి కుమారస్వామి అతిధులను స్వాగతించి శాలువా మెమొంటోతో సత్కరించడం జరిగింది. కార్యక్రమంలో వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, వరంగల్ ఎమ్మార్వో ఎండి ఇక్బాల్, కెఎంసి ప్రిన్సిపల్ రామ్ కుమార్ రెడ్డి, సిఐ లు షుకూర్, తుమ్మ గోపి, జూపల్లి వెంకటరత్నం, ఒంటేరు రమేష్, ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, నార్కోటిక్ సీఐ రవీందర్, వరంగల్ డిపిఆర్ఓ అయూబ్ ఆలి, డిప్యూటీ డిఎంహెచ్ఓ హరిసింగ్, ఎన్.సి.సి అధికారి కెప్టెన్ డా సతీష్ కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, కాకతీయ మెడికల్ కళాశాల జూడ అసోసియేషన్ బాధ్యులు, టీఎన్జీవోస్ బాధ్యులు రాజేష్, లయన్స్ క్లబ్ సభ్యులు రాజగోపాల్, మరియు యువజన సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని వర్గాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ములుగు జిల్లా అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి రాజు వర్ధన్, రంజిత్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ ధీర్,పోతుగంటి సతీష్, విక్రమ్, శ్రీరామ్,జనగామ అధ్యక్షులు నరేందర్ మరియు సభ్యులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల టిఎస్ జేయు యూనియన్ బాధ్యులు ముత్యం ముఖేష్ గౌడ్, మహమ్మద్ రియాజ్, జి ఆంజనేయులు, మెరుగు విష్ణుమోహన్ పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ బాధ్యతలు తోకల అనిల్ కుమార్, నాగపురి నాగరాజు, రావుల నరేష్ ,వరంగల్ జిల్లా కమిటీ బాధ్యులు కందికొండ మోహన్, ఆవునూరి కుమారస్వామి, లింగబత్తిని కృష్ణ ,కందికొండ గంగరాజు, ఈద శ్రీనాథ్, బత్తుల సత్యం, నీరుటి శ్రీహరి, కౌడగాని మోహన్ రావు, అడప అశోక్ అవినాష్ ,భాగ్య రాజు ,సురేష్, కమల్ రాజు తదితరులు పాల్గొన్నారు.