పాలగుమ్మి విశ్వనాధం గారు వ్రాసిన ఈ గీతం శ్రీమతి వేదవతీ ప్రభాకర్ గానం చేయగా, ఆకాశవాణిలో చాలా సంవత్సరాల క్రితం ప్రసారమైన అద్భుతమైన గీతం. ఒక ఆడపిల్లతో ఆ తల్లిదండ్రులకు కల సంబంధం ఎంత అందంగా ఉంటుందో వర్ణిస్తారు రచయిత. నిన్ను చూడకుంటే నాకు బెంగ, ఎందుకంటే నా కొంగు పట్టుకు నావెనక వెనక తిరుగుతూ, ఏవేవో ప్రశ్నలడుగుతూ, గల గలా నవ్వుతూ ఉండే నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఎప్పుడో ఒక అయ్య నిన్ను పెళ్లి చేసుకుని ఆనందంగా తీసుకెళ్తుంటే, నేను చేసిన పెళ్ళే అయినా, అతనితో వెళ్లి పోతావని తెలిసినా, ఈ హృదయం తట్టుకోలేక ద్రవించి పోయి, కనుల నీరుగా ప్రవహిస్తుంది. ఎప్పటికైనా ఆడపిల్ల ఆడపిల్లే అని తెలిసినా, ఎందుకో మనసు బరువెక్కి పోతుంది. నువ్వు అతనితో సరదాగా హాయిగా ఉంటావని తెలిసినా, నేను భోజనం చేసే టప్పుడు, నువ్వు గుర్తు వచ్చి అన్నం సహించదు. నీకు కలిపి గోరు ముద్దలు తినిపించాలని ఉంటుంది. అయినా ఆడపిల్లకి పెళ్లి చేయకా తప్పదు. అత్తవారింటికి పంపకా తప్పదు. నాకీ బెంగా తప్పదు. ఇది తీయని బెంగ తల్లీ! ఈ భావాలన్నీ ఆడపిల్ల కల ప్రతీ తల్లిదండ్రులకు కలిగేవే అయినా ఎందుకో ఈ పాట పాడుతుంటే, గొంతు జీర పోయింది. హృదయం విలపించింది. మరి మీకు ఎలా అనిపించింది. తెలియచేస్తారుగా! నమస్కారం.