Pratima Natakam story
మహాకవి కాళిదాసు అంతటివాడు ఎంతగానో కీర్తించిన మరో ప్రాచీన మహాకవి భాసుడు. సుమారు రెండు వేల సంవత్సరాల క్రితంవాడైన భాసమహాకవి అనేక రూపకాలను రచించాడు. వాటిలో కేవలం పదమూడు రూపకాలు మాత్రమే ప్రస్తుతం మనకు లభ్యమవుతున్నాయి. భాసుడు వ్రాసినన్ని నాటకాలు ఆయన తరువాత తరం వారైన కాళిదాస, భవభూతులు కూడా వ్రాయలేదు. భాసుడి నాటకాలన్నింటినీ కలిపి భాస నాటకచక్రం అని కూడా పిలుస్తుంటారు. వాటిలో ఒకటైన స్వప్నవాసవదత్త నాటకం గురించి కొంతకాలం క్రితం మనం మన అజగవలో చెప్పుకున్నాం. ఈరోజు మనం ఆ భాసమహాకవి మరో అత్యుత్తమ రచన ప్రతిమా నాటకం గురించి చెప్పుకుందాం.
ఈ ప్రతిమా నాటకంలో భాసుడు రామాయణ కథనే తీసుకుని అందులో చిన్నపాటి మార్పులు చేసి రమణీయమైన రూపకంగా మలిచాడు. ముఖ్యంగా వాల్మీకి రామాయణంలో దుష్టంగా కనబడే కైకేయి పాత్రను ఎంతో ఉదాత్తంగా తీర్చిదిద్దాడు. నిజానికి వాల్మీకి రామాయణంలో కూడా కైకేయి పాత్ర ముందు మంచిగానే ఉంటుంది. రాముడంటే ఆమెకు చెప్పలేనంత ప్రేమ. శ్రీరామపట్టాభిషేకం గురించి తెలియగానే ఆ కైకేయి ఎంతగానో పొంగిపోతుంది కూడా. కానీ ఆ తరువాత మంథర చేసిన దుర్బోధకు వశురాలైపోయి కౄరమైన మనస్తత్వం గల స్త్రీగా మారిపోతుంది. రాముడి వనవాసానికి, దశరథుడి మరణానికి కారణభూతురాలవుతుంది.
అయితే భాసమహాకవి ఇక్కడే ఒక చమత్కారమైన ఊహ చేశాడు. రాముణ్ణి వనవాసానికి పంపడం వెనుక కైక యొక్క ఉద్దేశ్యాన్ని వివరించే ఆ ఊహ కూడా తర్కానికి నిలబడేలానే ఉంటుంది తప్ప, ఏదో అతికించినట్టు మాత్రం ఉండదు. ఆ ఊహ ఏమిటో మనం కథా గమనంలో తెలుసుకుందాం. ఇక సీతారామలక్ష్మణులు నారచీరలు కట్టుకోవడానికి ఒక కారణాన్ని సృష్టించి, మూలకథలో లేని ఆ సన్నివేశాన్ని ఎంతో అందంగా మలిచాడు భాసుడు.
అలానే ఈ ప్రతిమా నాటకంలో భాసుడు చేసిన మరో మనోహరమైన మార్పు వాల్మీకి రామాయణంలో లేనటువంటి ప్రతిమాగృహ సన్నివేశాన్ని కల్పించడం. ఆ సన్నివేశాన్ని అత్యంత రమణీయంగా, కరుణరస భరితంగా నడిపించాడు భాసుడు. అంతేకాకుండా ఎంతో ఉదాత్తమైన భరతుని పాత్రను ఈ నాటకం ఆద్యంతం మరింత ఉదాత్తంగా తీర్చిదిద్దాడు.
ఇక ఈ నాటకంలో భాసుడు చేసిన మరో ప్రధానమైన మార్పు.. బంగారు జింక ఉదంతం. ఈ నాటకంలో రావణాసురుడు రాముడు ఉండగానే పరివ్రాజక వేషంలో వస్తాడు. తెలివిగా రాముణ్ణి బంగారు జింక కోసం పంపించి సీతాపహరణం చేస్తాడు. ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ ఉండడు. వాల్మీకి రామాయణం ప్రకారం సీతాదేవి లక్ష్మణుడిని బంగారు జింక ఘట్టంలో అనరాని మాటలంటుంది. మహా సౌశీల్యవతి, లోకపావని అయిన సీతాదేవి అలా కుమారుడి వంటి లక్ష్మణుడిని అనుమానిస్తూ దూషించడం భాసుడి మనసుకి కష్టంగా అనిపించి ఉంటుంది. అందుకే ఆ ఘట్టంలో కొంత మార్పు చేసి సీతాదేవి మాటలకు ఉన్న ఆ చిన్నపాటి దోషాన్ని కూడా తొలగించేశాడు.
ఇలా ప్రసిద్ధమైన రామాయణ కథలో చిన్నపాటి మార్పులు చేసి, ఔచిత్యభంగం కలుగకుండా, అనేక అందమైన ఊహలతో, వర్ణనలతో ఈ ప్రతిమా నాటకాన్ని రచించాడు భాస మహాకవి. రచనలో అంతటి నేర్పరి కనుకనే భాసో హాసః అంటూ కవితా కన్యక చిరుమందహాసమే భాసుడని జయదేవుడనే పండితకవి కీర్తించాడు. ఇక మనం ప్రతిమా నాటకం కథలోకి ప్రవేశిద్దాం.